Saturday 3 November 2012

'తప్పు'టడుగుల బాల్యం

Lead India Training will improve below situation...

It will inspire children to live in right path....

Corporate / Donors are invited to sponsor training programs for below poverty line children.

If Interested please contact Mr. Srinivas, Admin-Manager Lead India 9246333031


http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/nov/3/main/3main14&more=2012/nov/3/main/main&date=11/3/2012 


'తప్పు'టడుగుల బాల్యం
బాల నేరస్తుల్లో రాష్ట్రానిది ఆరో స్థానం
కొత్తవారే అధికం.. పేదరికానికి అనుగుణంగా నేర ప్రవృత్తి
అధికారిక సర్వేలో వెల్లడి

హైదరాబాద్, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఆడుతూ పాడుతూ.. నవ్వుతూ తుళ్లుతూ కేరింతలు కొట్టాల్సిన బాల్యం.. 'తప్పు'టడుగుల కారణంగా కొడిగట్టిపోతోంది. క్షణికావేశమో లేక తల్లిదండ్రులు, సంరక్షకుల ఆలనాపాలనా లోపం వల్లనో చాలామంది బాలబాలికలు నేరస్తులుగా మారుతున్నారు. జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కొన్ని చిన్న తేడాలతో.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నేరాల్లో బాలల పాత్ర అందరినీ కలిచివేస్తోంది. బాలలు పాల్గొన్న నేరాల్లో దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో మన రాష్ట్రం పోటీ పడుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

కిందటి ఏడాది (2011) దేశంలో బాలలు పాల్పడ్డ నేర సంఘటనల విషయంలో మన రాష్ట్రం జాతీయస్థాయిలో ఆరవ స్థానంలో నిలిచింది. తొలి ఐదు స్థానాల్లో వరుసగా.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలున్నాయి. ఇవి వివిధ రాష్ట్రాల్లో కేంద్రం అధికారికంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైన వాస్తవాలు. మన రాష్ట్రంలో గత ఏడాది బాలబాలికల ప్రమేయం ఉన్న నేర సంఘటనలు 2,213 జరిగాయి. ఇందులో హత్యలు 101, అత్యాచారాలు 646, కిడ్నాప్‌లు 735, దొంగతనాలు 646, ఇళ్ల లూటీలు 229, దొమ్మీలు 23, దోపిడీలు 22, కొట్టి దోచుకెళ్లటం వంటి సంఘటనలు 3 ఉన్నాయి.

ఈ నేరాలకు పాల్పడిన వారంతా మైనర్లే కావడం నమ్మలేని నిజం. కొందరు సహవాస దోషం వల్ల, మరికొందరు కుటుంబ నేపథ్యం వల్ల, ఇంకొందరు ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆయా సంఘటనల్లో అరెస్ట్ అయిన బాలనేరస్తులు మన రాష్ట్రంలో 2 వేల పైచిలుకే ఉన్నారు. సర్వే నాటికి 2,474 మంది బాల నేరస్తులను అరెస్ట్ చేస్తే, అందులో 911 మంది నిరక్షరాస్యులు. ప్రాథమిక విద్య చదివిన వారు 969 మంది.. పదో తరగతికంటే తక్కువ చదివిన వారు 402 మంది.. ఎక్కువ చదివిన వారు 192 మంది ఉన్నారు.

కాగా.. రాష్ట్రంలో అరెస్ట్ అయిన బాలనేరస్తుల్లో అత్యధికులు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నావారే కావడం గమనార్హం. ఈమేరకు పిల్లలపై తల్లిదండ్రుల 'ముద్ర' ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నిరుడు జరిగిన నేరాల్లో అరెస్ట్ అయిన బాల నేరస్తుల్లో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్న వారు 1,831 మంది కాగా, సంరక్షకులతో కలిసి జీవిస్తున్న వారు 192 మంది. 451 మంది పిల్లలు నిరాశ్రయులు. మనకంటే ఎక్కువ మంది బాల నేరస్తులున్న రాష్ట్రాల్లోనూ ఇంతమంది నిరాశ్రయులు లేకపోవటం గమనార్హం.

బాల నేరస్తులు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 6,770 మంది ఉండగా, అందులో నిరాశ్రయులు కేవలం 189 మందే. రాజస్థాన్‌లోని 2,542 మంది బాల నేరస్తులలో నిరాశ్రయుల సంఖ్య 18 మాత్రమే. ఈ క్రమంలో మన రాష్ట్రంలో జరిగిన నేరాల్లో వాస్తవంగానే నిరాశ్రయులైన బాలలు నిందితులుగా ఉన్నారా? లేక కేసుల ఒత్తిడి తగ్గించుకోవటానికి మన పోలీసులు నేరాలను నిరాశ్రయులైన బాలలపై మోపుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మన రాష్ట్రంలో అరెస్ట్ అయిన బాల నేరస్తుల్లో.. నిరుపేదలు, కొత్తగా నేరాలకు పాల్పడుతున్న వారే ఎక్కువగా ఉండటం మరో విశేషం.

అరెస్ట్ అయిన వారిలో తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.25వేల ఉన్న వారు 1,919 మంది ఉన్నారు. రూ.25 వేలు- రూ.50 వేల మధ్య ఆదాయం ఉన్నవారు 375 మంది.. రూ.50 వేలు-రూ.1 లక్ష ఆదాయం ఉన్న వారు 154 మంది.. రూ.1 లక్ష-రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు 25 మంది.. రూ.2లక్షలు-3లక్షల ఆదాయం ఉన్న వారు ఒక్కరున్నారు. అరెస్ట్ అయిన వారిలో కొత్తగా నేరానికి పాల్పడ్డవారు 2,235 మంది ఉండగా.. పాత నేరస్తులు 239 మంది ఉన్నారు. ఈ గణాంకాలు బాలల్లో పెరుగుతున్న నేరప్రవత్తికి అద్దం పడుతున్నాయి. వీటికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.

రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు.. బాలలు నేరాల్లో పాల్గొనకుండా గట్టి చర్యలు చేపడితేనే వారికి మంచి భవిష్యత్తును ఇచ్చిన వారవుతారు. అదే సమయంలో ప్రభుత్వంతోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని నిరాశ్రయులైన బాలలను చేరదీయటం, పేదరికం వల్ల చదువుకు దూరమైన బాలలను పాఠశాలల్లో చేర్చడం, నేరప్రవత్తి వల్ల కలిగే కష్టనష్టాలను పాఠశాలల్లో వివరించి చెప్పడం వల్ల.. నేరాల్లో బాలల పాత్ర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment